తెలంగాణ ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నెల 18 న ఖమ్మం వేదికగా జరిగే ఈ సభకు సీఎం కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయ్ విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ రానున్నారు. టీఆర్ఎస్ కాస్తా… బీఆర్ఎస్ గా మారిపోయిన తర్వాత… మొట్ట మొదటి సభ ఇదే. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లటంపై ఇప్పటికే రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం కోరిన సీఎం కేసీఆర్‌, ఈ సభ ద్వారా దేశ రైతాంగానికి, రాజకీయ పక్షాలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ ద్వారా దేశ వ్యవసాయరంగంలో తీసుకొచ్చే మార్పులపై ఈ సభ ద్వారా వివరించనున్నట్టు తెలిసింది.

ఈ సభ కోసం లక్ష మందికి పైగా జన సమీకరణ చేయాలని సీఎం కేసీఆర్ నేతలను ఆదేశించారు. ఖమ్మంతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల నుంచి జన సమీకరణ చేయనున్నారు. 18న ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెళ్లనున్న నేపథ్యంలో.. అదే రోజు బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఆదివారం రాత్రి మంత్రి పువ్వాడ అజయ్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతోపాటు వరంగల్‌, తదితర జిల్లాలకు చెందిన మంత్రులతో సమావేశమై చర్చించారు.