ఖమ్మంలో జరగనున్న భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు అంతా సిద్ధమైంది. ఖమ్మం సమీపంలోని వెంకటాయపాలెం దగ్గరున్న 100 ఎకరాల్లో ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. సీఎం కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయ్ విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, తెలంగాణ వామపక్ష నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే పలువురు నేతలు సభ కోసం హైదరాబాద్ కి చేరుకున్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రత్యేక విమానంలో యూపీ నుంచి హైదరాబాద్ కి చేరుకున్నారు. మంత్రి తలసాని సాదరంగా స్వాగతం పలికారు.

వివిధ జిల్లాల నుంచి 5 వేల మంది పోలీసులు ఇప్పటికే ఖమ్మం చేరుకున్నారు. సభ ఏర్పాట్లు, అవసరమైన వాటిని మంత్రి హరీశ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే వున్నారు. బీఆర్ఎస్కు చెందిన 100 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు హాజరుకానున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగాం, సూర్యాపేట జిల్లాల నుంచి 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 లక్షల మందిని సమీకరిస్తున్నారు.

బహిరంగ సభ నేపథ్యంలో ఇప్పటికే అటు తెలంగాణ నేతలు, ఏపీ బీఆర్ఎస్ నేతలు ఖమ్మం బాట పట్టారు. మంత్రి హరీశ్ రెండు రోజులుగా ఖమ్మంలోనే వుంటూ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 1000 మంది వాలంటీర్లను సిద్ధం చేశారు. సభకు వచ్చిన ప్రజలకు మజ్జిగ, మంచీనరు అందించడానికి ఇబ్బందులు లేకుండా చూడాలని వాలంటీర్లను మంత్రి హరీశ్ సూచించారు. ఇక.. బందోబస్తు నిమిత్తం అదనపు డీజీ విజయ్ కుమార్, ఐజీపీ షాన్ వాజ్ ఖాసీం, చంద్రశేఖర్ రెడ్డి, డీఐజీలు, వరంగల్, ఖమ్మం సీపీలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.