పదో తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్‌లో బయటకు రావడం వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందని, అది ఇప్పుడు బయటపడిందని అధికార బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో బీజేపీ నేతలు, బండి సంజయ్ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. పదో తరగతి ప్రశ్నపత్రాన్ని బండి సంజయ్‌ డైరెక్షన్‌లోనే బీజేపీ కార్యకర్త ప్రశాంత్‌ లీక్‌ చేశారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. బీజేపీ అనుబంధ సంఘాలు కుట్రపూరితంగా పేపర్‌ లీక్ చేశాయని ఆరోపించారు. బండి సంజయ్‌పై పీడీ యాక్ట్‌ పెట్టాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.

 

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల విషయంలో పోటీ పడడంలో బీజేపీ నేతలు వెనుకబడ్డారని ఆయన చెప్పారు. తమతో పోటీపడలేక బీజేపీ నేతలు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీలో రాజశేఖర్ రెడ్డితో బండి సంజయ్ పేపర్ లీక్ చేయించారని ఆయన ఆరోపించారు. పేపర్ లీక్ విషయంలో కీలకంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. 9 ఏళ్లలో రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగలేదని ఆయన గుర్తు చేశారు.

 

ఇక… బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా బీజేపీపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌తో పోటీపడలేక బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. రాష్ట్రంలో అశాంతి, అలజడి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ఢిల్లీ బీజేపీ పెద్దల డైరెక్షన్‌లోనే రాష్ట్ర బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

 

పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని బాల్క సుమన్‌ విమర్శించారు. పదో తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్‌లో పెట్టిన ప్రశాంత్‌ది బీజేపీ సోషల్‌ మీడియా విభాగంలో కీలక పాత్ర అని తెలిపారు. తెలంగాణకు పెట్టబడులు వస్తే బీజేపీ నేతలకు కండ్లు మండుతున్నాయని విమర్శించారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. రాజకీయంగా కేసీఆర్‌ను ఎదుర్కోలేకనే బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.