సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మహాధర్నా చేపట్టాయి. ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మోదీ హటావో సింగరేణి బచావో అంటూ నినాదాలు చేస్తున్నారు. రాష్ట్రంపై ప్రధాని సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు మహాధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేస్తున్నారు. భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, గోదావరిఖని, రామగుండం, మందమర్రి, నస్పూర్‌, ఇల్లందులో ధర్నాకు దిగారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కొన్ని చోట్ల పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

కాగా, బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భూపాలపల్లిలో నిర్వహించనున్న ధర్నాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం యత్నిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. సింగరేణి ప్రైవేటికరణ ఆపే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. పేదల పొట్టకొట్టి పెద్దలకు పంచడమే మోదీ విధానమని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని ప్రధాని నరేంద్ర మోదీఆరోపించడం సిగ్గుచేటని అన్నారు. పార్లమెంట్‌లో అన్ని బిల్లులకు బీఆర్‌ఎస్‌ సహకరించలేదా? అని ప్రశ్నించారు.రైతులకు, తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని విధాన పరంగా కేంద్రాన్నివ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. రైతులను ముంచి ఆదానీ, అంబానీలకు దోచి పెడితే తామేందుకు సహకరించాలని అన్నారు.

సీఎం కేసీఆర్ రాష్ట్ర సంపదను ప్రజల అభివృద్ధికి పంచుతుంటే నరేంద్ర మోదీ దేశ సంపదను దోస్తులకు దోచి పెడుతున్నాడని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆరోపించారు. కేంద్రానికి సహకరించడం లేదని చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు. తెలంగాణను విచ్ఛినం చేయడానికి చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.బండి సంజయ్ పేపర్ లీక్‌కు పాల్పడి జైలుకు వెళితే ఆయన్ను మందలించాల్సింది పోయి, అభినందిస్తున్నారని విరుచుకుపడ్డారు.