చైనాతో సంబంధాల విషయంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో బ్రిటన్ కొనసాగించిన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన స్వర్ణయుగం ముగిసిపోయిందన్నారు. దేశ విదేశాంగ విధానంపై బ్రిటన్ పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల అతిథులు, ఆర్థిక నిపుణులతో సునాక్ సమావేశమయ్యారు. చైనా రాజ్యవిస్తరణ కాంక్ష, ఆధిపత్య ధోరణి కారణంగా సత్సంబంధాలు సాధ్యం కావడం లేదని తేల్చి చెప్పారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఓ దశకు చేరుకున్న తర్వాత సామాజిక, రాజకీయ సంస్కరణలకు దారి తీయాలే తప్ప, ఆధిపత్య ధోరణి వైపు వెళ్లొద్దని సుతి మెత్తగా చురకలంటించారు.
ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బ్రిటన్ ముందునుంచీ మద్దతు పలుకుతోందని గుర్తు చేశారు. అయితే… భారత్- బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుకు తాము కట్టుబడే వున్నామని స్పష్టం చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యాపార అవకాశాలు బోలెడున్నాయని, 2050 కల్లా ప్రపంచ వాణిజ్యంలో సగం వాటాను ఇండో పసిపిక్ హస్తగతం చేసుకుంటుందని సునాక్ పేర్కొన్నారు.