రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ పై రెజర్లు చేస్తున్న ఆందోళనలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా తనపై వస్తున్న ఆరోపణలను డబ్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ఖండించారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అవన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి, అన్ని విషయాలూ వెల్లడిస్తానని ప్రకటించారు. అయితే… బ్రిజ్ భూషణ్ ని రాజీనామా చేయాలని క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.

మరో వైపు రెజ్లర్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో సమావేశం నిర్వహించారు. భజరంగ్ పూనియా, రవి దహియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ వంటి రెజ్లర్లతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమావేశమయ్యారు. ఈ సమావేశం గురువారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది. ఆరోపణలపై సమాఖ్య నుంచి వివరణ వచ్చే వరకూ వేచి చూడాలన్న కేంద్ర మంత్రి అనురాగ్ ప్రతిపాదనకు రెజ్లర్లు వ్యతిరేకించారు. బ్రిజ్ భూషణ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అప్పటి దాకా నిరసన విరమించమని తేల్చి చెప్పారు. దీంతో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే వుంది.












