అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు చేస్తున్న యాత్రను అడ్డుకోవడం పెద్ద పని కాదని, 5 నిమిషాలు చాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.అది ప్రజాస్వామ్య పద్ధతి కాదన్న ఉద్దేశంతోనే ఆ పని చేయడం లేదని అన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా అన్న అంశంపై విశాఖలో ఓ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అమరావతి రైతులు చేస్తున్నది పాదయాత్రా? రియల్ ఎస్టేట్ యాత్రా? రాజకీయ యాత్రా అన్నది అర్థం కావడం లేదని బొత్స అన్నారు. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తే చంద్రబాబుకు లేదా అమరావతి రైతులకు కలిగే నష్టమేంటని ప్రశ్నించారు.
విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రను డెవలప్ చేసుకోవచ్చన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స పేర్కొన్నారు. అంతేకానీ.. ఏ ఒక్కరినో ఇబ్బంది పెట్టాలని, కించపరచాలన్నది తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలను డెవలప్ చేయాలని అనుకోవడం ధర్మమని, దానికి కట్టుబడి వుండకపోతే… మంత్రి పదవికే అనర్హడినని అన్నారు.