తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత నేటితో కరీంనగర్ లో ముగియనుంది. ఐదో విడత పాదయాత్రను భైంసా పరిసర ప్రాంతాల నుంచి ప్రారంభించారు. దాదాపు 1,400 కిలోమీటర్ల మేర యాత్ర నిర్వహించి, కరీంనగర్ లో ముగించనున్నారు. ఈ ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. జేపీ నడ్డాతో పాటు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు జాతీయ నేతలు కూడా హాజరవుతున్నారు.

ఇక… ఈ సభ కోసం బీజేపీ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. లక్ష మందిని సమీకరించేలా టార్గెట్ పెట్టుకుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే భారీగా జన సమీకరణ చేసి, టీఆర్ఎస్ కు ఝలక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేయనున్నారు. నేడు మధ్యాహ్నం 2 గంటలకు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగుతారు. అక్కడే బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించి, కరీంనగర్ కు బయల్దేరుతారు.