కేంద్రంలోని బీజేపీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో దుమ్ము దుమారం రేపాయి. ఖర్గే తమకు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇందుకు ఖర్గే అంగీకరించకపోవడంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్ లో జరిగిన యాత్రలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. దేశం కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందని తెలిపారు. బీజేపీ దేశం కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. కనీసం బీజేపీ నేతల ఇంట్లోని శునకమైనా దేశం కోసం చనిపోయిందా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇందిరా, రాజీవ్ వంటి నేతలు దేశం కోసం ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. ఇంత జరిగినా… బీజేపీ నేతలు తామే దేశ భక్తులమని చెప్పుకుంటారని, తాము ఏమైనా విమర్శిస్తే దేవ ద్రోహులుగా ముద్ర వేసేస్తారని అసహనం వ్యక్తం చేస్తూ ఖర్గే సభలో ప్రసంగించారు. ఈ వ్యాఖ్యలపైనే రాజ్యసభలో బీజేపీ తీవ్ర నిరసన చేపట్టింది. ఖర్గే క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ పట్టుబట్టారు. లోక్ సభ, రాజ్యసభలోనూ బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.