మునుగోడు బైపోల్ ను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎలాగైనా అధికార టీఆర్ఎస్ కి ఝలక్ ఇచ్చి… ఇక్కడ పాగా వేయాలని నిర్ణయించుకుంది. ఇందుకు అనుగుణంగానే ఇప్పటికే ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించింది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే అధిష్ఠానానికి ఓ నివేదిక కూడా సమర్పించారు. రాష్ట్ర నేతలతో పాటు పార్టీకి చెందిన జాతీయ నేతలు కూడా మునుగోడుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మునుగోడు ప్రచారానికి రానున్నారు. ఈ నెల 31 న మునుగోడులో పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కానున్నారు. వచ్చే నెల 1 తో మునుగోడు ప్రచారానికి తెర పడుతుంది.

 

అందుకే జేపీ నడ్డా సభను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. మరో వైపు దాని కంటే ఒక రోజు ముందే సీఎం కేసీఆర్ సభ కూడా మునుగోడులో జరగనుంది. ఆ సభ కంటే ఎక్కువ మందిని సమీకరించే పనిలో బీజేపీ నిమగ్నమైంది. మునుగోడు సభకు నడ్డా వస్తున్నారని రాష్ట్ర నాయకత్వానికి నడ్డా కార్యాలయం సమాచారం ఇచ్చింది. దీంతో బీజేపీలో జోష్ పెరిగిపోయింది. కొన్ని రోజుల క్రిందటే నడ్డాకు సమాధి కట్టడం సంచలనంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో నడ్డా మునుగోడుకు రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.