బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దాడికి గురైన ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసాన్ని పరామర్శించారు. దాడి జరిగిన పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పోలీసుల సహకారంతోనే టీఆర్ఎస్ గూండాలు ఎంపీ అర్వింద్ నివాసంపై దాడికి దిగారని మండిపడ్డారు. ఎందుకు దాడి చేశారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. ఇంట్లో ఫర్నీచర్ ను టీఆర్ఎస్ గూండాలు ధ్వంసం చేశారని, అయితే… తమకు పెద్ద బాధ లేదన్నారు. అయితే… హిందూ దేవుళ్ల మీద దాడి చేశారని, హిందువులు పవిత్రంగా కొలిచే తులసీమాత, లక్ష్మీ అమ్మవారు, దుర్గామాత మీద దాడులు చేశారని విరుచుకుపడ్డారు. పైగా భయంకర హిందువులు అని ప్రకటించుకుంటున్నారని బండి చురకలంటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ క్రోమో ఫోబియాతో ఇబ్బందిపడుతున్నారని విమర్శించారు. అర్వింద్ ఎక్కడా బూతులు మాట్లాడలేదని, విమర్శ మాత్రమే చేశారన్నారు. దాడులు ఏ పార్టీ వారు చేసినా… అది మంచిది కాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అహంకారం ఎలా వుంటుందో తెలంగాణ ప్రజలందరూ చూశారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న విషయాన్ని తాము కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి విన్నవించామని వెల్లడించారు. ఇంత పెద్ద దాడి జరిగినా ఇప్పటి వరకూ సీఎం కేసీఆర్ ఎందుకు ఖండించలేదని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో అంత: కలహాలు ప్రారంభమయ్యాయని, అందుకే ఆధిపత్యం కోసం ఇలా దాడులు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.







