ప్రధాని నరేంద్ర మోదీ చదువుపై పనిలేని వారే అనవసర చర్చలు పెడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. చదువుకు.. పదవులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. టాప్ లీడర్‌గా ప్రపంచమే నరేంద్ర మోదీని గుర్తించిందని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలకు డబ్బులు పెట్టుబడి పెట్టేస్థాయికి కేసీఆర్ ఎలా వచ్చాడో చెప్పాలని ప్రశ్నించారు. నందినగర్ ఇంట్లో ఉన్నప్పుడు బ్యాంక్‌లోన్లు కట్టలేని కేసీఆర్‌కు వేల కోట్లు ఎక్కడివని నిలదీశారు.

గతంలో అపార్ట్‌మెంట్‌లో ఉన్న కవితకు.. ఇల్లు లేని‌ కేటీఆర్‌కు వేల కోట్లు, బంగళాలు ఎక్కడవన్నారు. కాళేశ్వరం దగ్గర నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో అన్నీ లీక్ లే అని వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న మంత్రి కేటీఆర్ ను కేబినెట్ నుంచి బయటకు పంపాలని డిమాండ్ చేశారు. పదో తరగతి హిందీ పేపరు కూడా లీక్ కావడం సిగ్గుచేటన్నారు.

ఇక బీఆర్ఎస్ పై కూడా బండి సంజయ్ ట్వీట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ట్విట్టర్ టిల్లు వేదికను పంచుకున్నారని మండిపడ్డారు. గవర్నర్‌ను దుర్భాషలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్‌గా పదోన్నతి పొందారని తెలిపారు. B అంటే బలత్కరీస్.. R అంటే రేపిస్టులు.. S అంటే లైంగిక వేధింపులు అంటే వ్యాఖ్యలు చేశారు. నాయకుడు ఎలా ఉంటే… అనుచరులూ అలాగే ఉంటారు అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.