కామారెడ్డి కలెక్టరేట్ వద్ద శుక్రవారం రాత్రి భారీ టెన్షన్ నెలకొంది. బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతతకు దారి తీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం కామారెడ్డిలో పర్యటించారు. టౌన్ ప్లానింగ్ కి వ్యతిరేకంగా ఎల్లారెడ్డి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు పయ్యావుల రాములు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అక్కడి నుంచి అకస్మాత్తుగా కలెక్టరేట్ ముట్టడికి బయల్దేరారు. దీంతో… టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసినా… వాటిని బీజేపీ శ్రేణులు తోసేసుకుంటూ కలెక్టరేట్ వైపు దూసుకెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. కలెక్టరేట్ లోపలికి తమను అనుమతించాలని రైతులు, బీజేపీ నేతలునినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇందులో భాగంగానే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి, పీఎస్ కు తరలిస్తుండగా… బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చివరికి అతి కష్టం మీద బండి సంజయ్ ని బలవంతంగా అదుపులోకి తీసుకుని, వాహనంలో ఎక్కించారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలు కొందరు పోలీసుల వాహనం అద్దాలు పగలగొట్టారు. దీంతో మరి కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రైతులు చిక్కిపోతున్నారని, రైతులను కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. రైతు రాములుది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. పంటలు పండే పొలాలను మాస్టర్ ప్లాన్లో తీసుకుంటారన్న భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. 40 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్, జిల్లా కలెక్టర్ స్పందించలేదని మండిపడ్డారు.