బీజేపీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలిస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేస్తామని తెలిపారు. వరంగల్ లో నిరుద్యోగ మార్చ్ జరిగింది. దీనికి నిరుద్యోగులు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. కాకతీయ యూనివర్సిటీ జంక్షన్‍ నుంచి నయీంనగర్‍, పోలీస్‍ కమిషనరేట్‍, పబ్లిక్‍ గార్డెన్‍ మీదుగా అంబేద్కర్‍ జంక్షన్‍ వరకు చేపట్టిన రెండు కిలోమీటర్ల ర్యాలీలో నిరుద్యోగులు, స్టూడెంట్లు, యువత, పార్టీ శ్రేణులు వేలాదిగా పాల్గొన్నారు. సాయంత్రం 5.40కు మొదలైన ర్యాలీ 7.10కి అంబేద్కర్‍ జంక్షన్‍ వద్దకు చేరుకుంది. అక్కడ అంబేద్కర్‍ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఓరుగల్లు నిరుద్యోగ మార్చ్ సాక్షిగా మాట ఇస్తున్నానని, తమ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే ఉద్యోగాల నియామకాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై హైకోర్టు సిట్టింగ్‍ జడ్జితో విచారణ చేయించాలని, దీనికి బాధ్యుడిగా మంత్రి కేటీఆర్‍ను బర్తరఫ్‍ చేయాలని పునరుద్ఘాటించారు. ఇదే వరంగల్ గడ్డపై తనను అరెస్ట్ చేశారని, కేసీఆర్ కి బలగం కేవలం కొడుకు, కూతురు, అల్లుడేనని, బీజేపీ బలగం మాత్రం యావత్ తెలంగాణ ప్రజలని అభివర్ణించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి, సీఎం కేసీఆర్ మోసం చేశారని, అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‍ చేశారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో కేసీఆర్‍ కుటుంబం తప్పు లేకుంటే వెంటనే సిట్టింగ్‍ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‍ చేశారు. తప్పు చేయనప్పుడు అభ్యంతరమేంటో చెప్పాలని ప్రశ్నించారు. అన్ని పేపర్ల లీకులకూ బండి సంజేయే కారణమని చెబుతున్నారని, ప్రజల సమక్షంలో కేసీఆర్‌ సమాధానం చెప్పక తప్పదన్నారు. టీఎస్‌పీఎస్సీ తప్పు లేకుంటే సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మార్చ్‌ ఇంతటితో ఆగదని, త్వరలో ఖమ్మం , పాలమూరు సహా 10 ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ మార్చ్‌ నిర్వహిస్తామని, తరువాత హైదరాబాద్‌లో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామన్నారు బండి సంజయ్‌.