తెలంగాణ రైతాంగ సమస్యలపై సంక్రాంతి తర్వాత ఉద్యమాలను తీవ్ర స్థాయిలో నిర్వహిస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ప్రకటించారు. పల్లె పల్లెకు బీజేపీ పేరుతో రైతు సమస్యలపై పోరాడుతామని స్పష్టం చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో’నినాదంతో మిషన్ 90 లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పారు. కామారెడ్డిలో రైతుల ఆందోళన సీఎం కేసీఆర్ పతనానికి నాంది అని ప్రకటించారు. దొడ్డి దారిన కాకుండా… గ్రామ సభ నిర్వహించి, మాస్టర్ ప్లాన్ పై నిర్ణయం తీసుకోవాలని లక్ష్మణ్ సూచించారు.

రైతుల హక్కులను కాలరాస్తూ.. కొత్తగా 111 జీవో తెచ్చి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులను కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, భూ సేకరణ పేరుతో, భూ దందాలకు పాల్పడుతోందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది ఎకరాల భూమిని సేకరించిందని, ఇప్పటి వరకూ సేకరించిన భూముల్లో ఎన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయో ఓ శ్వేత పత్రం విడుదల చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.