తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, అందులోకి తానెందుకు వెళ్తానని ప్రశ్నించారు. ఇక.. తనపై తప్పుడు ప్రచారానికి దిగిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని కీలక ప్రకటన చేశారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సోషల్ మీడియా లో తప్పుడు ట్రోల్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తున్నారని బాంబు పేల్చారు.
వారం రోజులపాటు ఢిల్లీలో మకాం వేసిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో రహస్య మంతనాలు జరిపింది నిజం కాదా అని రఘునందన్ రావు నిలదీశారు.సమయం సందర్భం వచ్చినప్పుడు రెండు పార్టీల మధ్య మధ్యవర్తిత్వం నడిపింది ఎవరనేది ప్రజల ముందు ఉంచుతామన్నారు. బీజేపీని దెబ్బతీయడానికి కాంగ్రెస్ కు అయ్యే ఎన్నికల ఖర్చును మొత్తం టీఆర్ఎస్ భరిస్తుందనే హామీ హస్తం పెద్దలకు ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు.