శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేశారు. స్పీకర్ పోచారం పట్ల ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై స్పీకర్ పోచారం స్పందిస్తూ… ఈ సమావేశాలు పూర్తయ్యే వరకూ ఈటలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
స్పీకర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అమర్యాదకంగా మాట్లాడాలని, వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు. సభ గౌరవాన్ని కాపాడేందుకే ఈటలపై చర్యలని ఆయన వివరించారు. సారీ చెప్పేందుకు ఈటల నిరాకరించారని, అందుకే ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి వేముల తెలిపారు. స్పీకర్ పోచారంను మరమనిషి అని రాజేందర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని మంత్రి అన్నారు.
అయితే… ఈటల మాట్లాడుతున్న సమయంలో టీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. దీనిపై ఈటల తీవ్రంగా స్పందించారు. సభ్యుడిగా సభలో మాట్లాడే అవకాశం తనకు వుందా? లేదా? అంటూ ప్రశ్నించారు. ఈటల క్షమాపణలు చెప్పాల్సిందేనని మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏం బెదిరిస్తున్నారా? అంటూ ఈటల ఫైర్ అయ్యారు. ఈటల అమర్యాదగా మాట్లాడారని, సభలో చర్చ కంటే బయట రచ్చకే ఆయన మొగ్గు చూపుతున్నారని మంత్రి వేముల అన్నారు.