బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంత్రి హరీశ్ కి సవాల్ విసిరారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మంత్రి హరీశ్ తో చర్చించేందుకు సిద్ధమని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ఈటల సవాల్ విసిరారు. జీఎస్ డీపీలో తెలంగాణ అప్పు 27.2 శాతం అని, ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అప్పు చేశారని ఈటల ఆరోపించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 36 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం వడ్డీ కడుతోందని, బడ్జెట్ రూప కల్పనలు అన్ని తప్పులున్నాయని విమర్శించారు. నీతి ఆయోగ్ కేవలం సిఫార్సులు మాత్రమే చేస్తుందని, కానీ… నీతి ఆయోగ్ డబ్బులు ఇస్తుందని చెప్పి, బడ్జెట్ లో లెక్కలు పెట్టామని, కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని బద్నాం చేస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం ఇస్తున్న పథకాలకు తెలంగాణ ప్రభుత్వం తన వాటాను సకాలంలో కట్టకపోవడం వల్లే నిధులు ల్యాప్స్ అవుతున్నాయని ఈటల వివరించారు. ఇందుకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు కేంద్రం సహకారం ఎలా అందిస్తుందో తెలంగాణకు కూడా అలాగే చేస్తోందన్నారు.

 

ఇక… వైఎస్ షర్మిల విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్ పై ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. షర్మిల బీజేపీ వదిలిన బాణమా? కాదా? అన్నది పక్కన పెడితే… ఆమెది ఓ పార్టీ అని అన్నారు. మరి… సీపీఐ, సీపీఎం సీఎం కేసీఆర్ విసిరిన బాణాలా? అంటూ ఈటల సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలను అన్ని పార్టీలూ చేస్తాయని, కానీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇది ఎవరు చేసినా… ఖండించాల్సిందేనన్నారు. ప్రభుత్వం పోలీస్ లను అడ్డం పెట్టుకొని అరాచకాలను పాల్పడుతోందని మండిపడ్డారు.