ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు రావడంపై తెలంగాణ బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… కవిత వల్ల తెలంగాణ సమాజమే తలదించుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. తప్పుడు పనులు చేస్తేనే… కేసీఆర్ కి తెలంగాణ సమాజం గుర్తుకొస్తుందని, మిగతా సమయాల్లో మాత్రం ఆయనకు తెలంగాణ గుర్తుకు రాదని ఎద్దేవా చేశారు.
ఈడీ నోటీసులకు, బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ బిడ్డ చేసే తప్పుడు వ్యవహారాలకు సమాజం ఎలా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం వుందని మాతో సహా… స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీలు ఆరోపించాయని గుర్తు చేశారు. బీజేపీకి దర్యాప్తు సంస్థలకు సంబంధం లేదని, బీజేపీ అధికారంలోకి రాక మునుపే… కాంగ్రెస్ హయాంలో కూడా ఆ సంస్థలున్నాయని బండి సంజయ్ గుర్తు చేశారు.
ఇక… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసులపై స్పందించారు. కవితకు ఈడీ నోటీసులిస్తే తప్పేంటని ప్రశ్నించారు. చేసిన తప్పులన్నీ చేసి… నోటీసులిస్తే.. తెలంగాణ సమాజానికి ముడిపెట్టడం ఏంటని మండిపడ్డారు. ఇలా చేస్తూ… రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ”లిక్కర్ దందా చేసింది మీరు.. అక్రమంగా కోట్లు సంపాదించింది మీరు.. దాన్ని వదిలేసి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీలపై విమర్శలు చేయటం ఏంటి” అంటూ ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం పెట్టలేదని.. అవి ఎప్పటి నుంచో ఉన్నాయన్నారు. ఈడీ నోటీసులతో బీజేపీకి ఏం సంబంధం అని మండిపడ్డారు. చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు.







