మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నామినేషన్ ను దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్లిన రాజగోపాల్ చండూర్ లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో 2 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ ఛుగ్, వివేక్ వెంకట స్వామి తదితరులు తరలి వెళ్లారు. నామినేషన్ దాఖలు తర్వాత కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికతో కేసీఆర్ పతనం ఖాయమని అన్నారు. మునుగోడు అభివృద్ధిని కేసీఆర్ అడ్డుకున్నారని విమర్శించారు. ఎన్నిసార్లు ఇక్కడి సమస్యలను లేవనెత్తినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు.

 

 

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యైనైనందుకు తనపై కక్షసాధింపుకు పాల్పడ్డారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టులకు ఆశపడి తాను బీజేపీలోకి వెళ్లినట్లు టీఆర్ఎస్ నాయకులు అసత్యం ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాను బీజేపీకి అమ్ముడు పోలేదని యాదగిరి లక్ష్మినరసింహా స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని, మరి కాదని కేసీఆర్, కేటీఆర్ ప్రమాణం చేస్తారా అని రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. దేశం మొత్తం మునుగోడు వైపే చూస్తోందని, ఈ ఎన్నికతో కేసీఆర్ కుటుంబ పాలన అంతమవడం ఖాయమన్నారు.