టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డిని గెలిపించాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఏవీఎన్ రెడ్డిని గెలిపించకపోతే.. టీచర్ల సమస్యలపై ప్రశ్నించే వారే మిగలరని అన్నారు. ఉపాధ్యాయ, అధ్యాపక ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నికలు కాబోతున్నాయని పేర్కొన్నారు. తమ అభ్యర్థిని గెలిపిస్తే… 317 జీవో సహా టీచర్ల సమస్యలపై పోరాడతామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులకు ప్రతి నెలా మొదటి నెలనే జీతం రావాలంటే ఏవీఎన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

 

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం టీచర్లకే పరిమితం కావని, ఇవి తెలంగాణ ప్రజల తల రాతను మార్చే ఎన్నికలని అభివర్ణించారు. ప్రస్తుతం ఎన్నికలున్న జిల్లాల్లో మాత్రమే ప్రతి నెలా మొదటి తేదీన జీతాలిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే… తమ బతుకులు ఆగమవుతాయని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కుటుంబ, అవినీతి, నియంత పాలనకు స్వస్తి పలికేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.

 

”బండి సంజయ్ అఫ్ట్రాల్ కార్పొరేటర్.. ఆయనను అధ్యక్షుడు చేస్తే ఏమైతదని ట్విట్టర్ టిల్లు అన్నాడు. మా నాయన ఉపాధ్యాయుడు. సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నా. నేను ఏనాడూ మా నాన్న పేరు చెప్పుకుని రాలేదు. మీ అయ్య లేకపోతే మిమ్ముల్ని కుక్కలు కూడా దేఖవ్. అమెరికాలో చిప్పలు కడిగొచ్చిన మీకు, నా క్యారెక్టర్‌కు పొంతనా ? నేను ప్రజల కోసం, హిందూ ధర్మం కోసం, 317 జీవో కోసం, ఆర్టీసీ కార్మికుల కోసం, నిరుద్యోగుల కోసం, తెలంగాణ కోసం జైలుకుపోయిన. మళ్లీ పోయేందుకు సిద్ధం.” అని బండి సంజయ్ ప్రకటించారు.