బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారంలో భారీ హైడ్రామా చోటు చేసుకుంటోంది. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పీఎస్ లో వున్న బండి సంజయ్ ని పోలీసులు తరలించిన విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పీఎస్ నుంచి కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్తున్న క్రమంలో పోలీసు వాహనాలకు పేపర్లు అతికించి, బండి సంజయ్ కనిపించకుండా తరలిస్తున్నారు పోలీసులు. దీనిపైనే ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి.

మరోవైపు బండి సంజయ్ ని వరంగల్ వైపు తరలిస్తున్నారు పోలీసులు. బండి సంజయ్ ని తరలిస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు పోలీసుల వాహనాలకు అడ్డంగా వచ్చి, తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బండి సంజయ్ ఏ కారులో ఉన్నారు అనేది తెలియకుండా.. ఆయన మీడియా కంట పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు.

ఇక బండి సంజయ్ ని అక్రమంగా అరెస్ట్ చేశారని బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ… రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా వున్న బీజేపీకి చెందిన ప్రముఖ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.
ఇప్పటికే ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై లీకేజీ ప్యాకేజీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళుతుండటంతోనే.. దాన్ని పక్కదారి పట్టించడానికి బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి ఇప్పుడు కారణాలు వెతుకుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతూ సంజయ్‌ను బేషరత్‌గా విడుదల చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.