గుజరాత్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మొదటి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 160 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. ఎన్నికల్లో భాగంగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక.. మాజీ సీఎం విజయ్ రూపాణీ, సీనియర్ నేత భూపేంద్ర సింగ్ చూడసమ తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. అయితే… ఈ 160 లో డిసెంబర్ 1 న పోలింగ్ జరిగే 84 సీట్లకు చెందిన అభ్యర్థులే అధికంగా వున్నారు. ఇక… క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకి కూడా బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి రవీంద్ర జడేజా భార్య రివాబా బరిలోకి దిగనున్నారు.

బీజేపీ గుజరాత్ పై ప్రత్యేక ద్రుష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో ఎలాగైనా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకొని, రికార్డు నెలకొల్పాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. బుధవారం సాయంత్రమే ప్రధాని మోదీ అధ్యక్షతన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరిగింది. దీనిలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాీ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ భేటీ ముగిసిన ఒక రోజుకే గుజరాత్ అభ్యర్థుల మొదటి జాబితా రిలీజ్ అయ్యింది.












