గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ భూపేంద్ర పటేల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర రాజధాని నగరంలోని నూతన సచివాలయం సముదాయంలో ఉన్న హెలిపాడ్ మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పురుషోత్తం రూపాలాతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. యూపీ సీఎం యోగి, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి, కర్నాటక సీఎం బొమ్మై, త్రిపుర సీఎం మాణిక్ సామా, మహారాష్ట్ర సీఎం ఏకనాథ్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ హాజరయ్యారు. వీరితో పాటు దేశ వ్యాప్తంగా 200 మంది సాధువులు కూడా హాజరయ్యారు.

ముఖ్యమంత్రి పటేల్‌తోపాటు 17 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో కాను దేశాయ్, హృషీకేశ్ పటేల్, రాఘవ్‌జీ పటేల్, బల్వంత్ సింహ్ రాజ్‌పుట్, కున్వర్జీభాయ్ మోహన్‌భాయ్ బవలియా, ములు అయర్ బేరా, కుబేర్ డిండోర్, భాను బబారియా, హర్ష సంఘవి (ఎంఓఎస్ ఇండిపెండెంట్ ఛార్జ్), జగదీశ్ విశ్వకర్మ, రజనీకాంత్ పటేల్ ఉన్నారు.

ఈ సందర్భంగా సీఎం భూపేంద్ర పటేల్ తో పాటు అతని టీమ్ కి ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు ప్రకటించారు. గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది చాలా శక్తిమంతమైన టీమ్ అని మోదీ అభివర్ణించారు. గుజరాత్ ను ఈ టీమ్ తొక్క పుంతలు తొక్కిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు.












