ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రానున్న భజే వాయువేగం సినిమా మీద కార్తికేయ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత కొన్ని సినిమాలుగా ఫ్లాపులు అందుకుంటున్న కార్తికేయకు ఈ సినిమా హిట్ అవడం ఎంతో అవసరం. యువి బ్యానర్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో రిలీజ్ పరంగా కూడా ఎలాంటి ఢోకా లేదు. కాకపోతే అదే రోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గంగం గణేశా లాంటి సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. బజ్ పరంగా ఆ రెండు సినిమాలకు దీనికంటే ఎక్కువ క్రేజ్ ఉంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా సెన్సార్ కు ముందు ఓ పెద్ద గండం నుంచి తప్పించుకుంది. షూటింగ్ అయ్యాక ఎడిటింగ్ చేసిన కాపీ ఉన్న హార్డ్ డిస్క్ లో తలెత్తిన సమస్య వల్ల టీమ్ కొన్ని నెలల పాటూ ఎంతో ఆందోళన చెందింది. ఈ విషయం హీరో కార్తికేయకు తెలిస్తే టెన్షన్ పడతాడని ఆయనకు చెప్పకుండా విషయాన్ని దాచి ఆ హార్డ్ డిస్క్ కు మరమత్తులు చేయించి దాన్ని ఓ కొలిక్కి తెచ్చారట. ఎడిట్ అయిన కాపీకి ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చి దాన్ని తిరిగి పొందడం చాలా లక్కీ అని చెప్పాలి. లేదంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయ్యేది.
మళ్లీ ఫస్ట్ నుంచి ఎడిటింగ్ చేయాల్సి వచ్చేది. చేసినా ముందు క్వాలిటీ తర్వాత వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఎవరికీ తెలియని ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి బయటపెట్టాడు. అలా భజే వాయువేగం పెద్ద రిస్క్ నుంచి తప్పించుకుంది. హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కార్తికేయకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.