తెలంగాణ ప్రభుత్వం హిందువుల పండగలపై ఆంక్షలు విధిస్తే చూస్తూ ఊరుకునేది లేదని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్ రావు తేల్చి చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వినాయక నిమజ్జనాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఆయన బేగంబజార్ లోని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యాలయంలో దీక్ష చేపట్టారు.
హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో భగవంత్ రావు తన దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇది హిందువుల అందరి విజయమని హర్షం వ్యక్తం చేశారు. గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతోనే దీక్ష విరమించామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తామని హామీ ఒచ్చారు. అయితే.. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అధికారులూ తమకు సహకరించాలని ఆయన కోరారు.