బెంగళూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి తల్లీ, కుమారుడు మృతి చెందారు. ఈ ఘటన నగరంలోని నగావరా ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ కుటుంబంపై మెట్రో పిల్లర్ పడటంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. 28 ఏళ్ల తేజశ్విని, ఆమె మూడేళ్ల కుమారుడు విహాన్ మృతి చెందారు.
తేజశ్విని భర్త, కుమార్తె చికిత్స పొందుతున్నారు. దీనిపై దర్యాప్తును సాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరో వైపు ఈ దుర్ఘటనపై సీఎం బొమ్మై స్పందించారు. ఈ విషాదంపై తనకు సమాచారం అందిందని, దీనిపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబానికి పరిహారం అందజేస్తామన్నారు. ఇక.. బెంగళూరు మెట్రోరైల్ కార్పొరేషన్ బాధిత కుటుంబానికి 20 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.












