100 శాతం ఫామిలీ ఎంటర్టైనర్ ‘స్వాతిముత్యం’ – హీరో బెల్లంకొండ గణేష్

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వినోదభరితమైన ఈ కుటుంబ కథా చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన హీరో గణేష్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
*స్వాతిముత్యం ఎలా మొదలైంది?
నేను ఓ మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవ్వాలని ఎదురుచూస్తున్న సమయంలో లక్ష్మణ్ ఈ కథ చెప్పారు. ఈ కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మి, ఈ కథను సితార వారి దగ్గరకు తీసుకెళ్లగా నాగ వంశీ గారికి కూడా కథ నచ్చింది. ఇది తమ బ్యానర్ లో చేస్తే మంచి సినిమా అవుతుందని భావించిన ఆయన ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు.
*మాస్ సినిమాతో కాకుండా ఇంత క్లాస్ సినిమాతో రావడానికి కారణం?
సినిమా అంటే ఖచ్చితంగా పోరాట సన్నివేశాలు ఉండాలని నేను అనుకోను. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎలాంటి జోనర్ సినిమానైనా ఆదరిస్తారు. కథ బాగుండాలి, సినిమా బాగుండాలి అని ఆలోచించాను కానీ ప్రత్యేకంగా ఈ జోనర్ లోనే సినిమా చేయాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు.
*మొదటి సినిమా కదా మీ అన్నయ్య(బెల్లంకొండ శ్రీనివాస్) ఏమైనా సలహాలు ఇచ్చారా?
ఏం ఇవ్వలేదండి. ఇంట్లో వాళ్ళందరూ నేను చేయగలగని నమ్మారు.
*మీ మొదటి సినిమాకి ఇలాంటి కథని ఎంచుకోవడానికి కారణమేంటి?
ప్రస్తుతం కథలో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదు. తర్వాత ఓటీటీలో చూడొచ్చులే అనుకుంటున్నారు. అందుకే నేను కత్తదనం ఉన్న కథ కోసం వెతుకుతుండగా.. లక్ష్మణ్ వచ్చి ఈ కథ చెప్పారు. ఈ కథలో వైవిద్యం ఉంది. ఇది ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మి ఈ సినిమా చేయడం జరిగింది.
*హీరోగా సెట్ లో అడుగుపెట్టడం ఎలా అనిపించింది?
సినిమా రంగం, సినిమా సెట్ నాకు కొత్త కాదు. ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకున్న అనుభవం ఉంది. మొదటి నుంచి సినిమా రంగంలోనే ఉండాలి, ఇక్కడే ఏదోకటి చేయాలని అనుకునేవాడిని. తెర వెనక ప్రొడక్షన్ వ్యవహారాలు అలవాటే గానీ కెమెరా ముందు నటించడం ఇదే మొదటిసారి. అయితే ముందే నటనలో శిక్షణ తీసుకోవడం, అన్ని విషయాల గురించి తెలుసుకోవడం వల్ల చిత్రీకరణ సమయంలో ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు.
*’విక్కీ డోనార్’ చిత్రానికి, మీ చిత్రానికి పోలికలు ఉన్నాయి అంటున్నారు?
రెండు చిత్రాల కథాంశం మాత్రమే ఒకటి. ఈ రెండు చిత్రాలకు ఎలాంటి సంబంధం లేదు. సినిమా చూశాక ఆ విషయం మీకే అర్థమవుతుంది.
*ఈ సినిమాలో వినోదం ఎలా ఉంటుంది?
సందర్భానుసారం వచ్చే హాస్యమే తప్ప కావాలని ఇరికించినట్లు ఎక్కడా ఉండదు. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా వినోదాన్ని పంచుతుంది. ప్రేక్షకులు చిరునవ్వుతోనే థియేటర్ల నుంచి బయటకు వస్తారు. కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది ఈ చిత్రం.
*సీనియర్ నటీనటులతో పని చేయడం ఎలా ఉంది?
నా మొదటి సినిమాకే రావు రమేష్ గారు, నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, గోపరాజు గారు, సుబ్బరాజు గారు, ప్రగతి గారు, సురేఖా వాణి గారు ఇలా ఎంతో ప్రతిభ, అనుభవమున్న నటీనటులతో పని చేయడం నా అదృష్టం. వారి తో కలిసి పని చేయడం వల్ల నా నటన మెరుగుపడింది.
*ఈ సినిమా పట్ల మీ నాన్నగారి(బెల్లంకొండ సురేష్) అభిప్రాయమేంటి? ఆయన మిమ్మల్ని లాంచ్ చేయాలి అనుకోలేదా?
లక్ష్మణ్ వచ్చి నాకు ఈ కథ చెప్పగానే మొదట నాన్నగారికే చెప్పాను. ఆయనకు కూడా కథ బాగా నచ్చింది. నేను నా మొదటి సినిమా బయట బ్యానర్ లో చేయాలని ముందునుంచే అనుకున్నాను. ఎందుకంటే బయట బ్యానర్ లో చేయడం వల్ల కథని నమ్మి ఈ సినిమా చేస్తున్నారన్న విషయం ప్రేక్షకులకు అర్థమవుతుంది.
*మీకు ఏ జోనర్ సినిమాలు ఇష్టం?
నాకు రొమాంటిక్ కామెడీ సినిమాలు చూడటం ఇష్టం. కానీ చేయడం మాత్రం అన్ని రకాల సినిమాలు చేయాలనుంది. నా మొదటి పది సినిమాలు పది విభిన్న జోనర్లు చేయాలి అనుకుంటున్నాను.
*దీనికంటే ముందు ప్రారంభించిన మీ సినిమా ఆగిపోయింది కదా?
అవును పవన్ సాధినేని గారు దర్శకుడు. ఆ కథ కూడా చాలా బాగుంటుంది. అది అమెరికాలో కొన్ని రోజులు చిత్రీకరణ చేయాల్సి ఉంది. కానీ ఆ సమయంలోనే కరోనా రావడంతో అప్పుడు ఆ చిత్రాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికైనా దర్శక నిర్మాతలు పిలిస్తే ఆ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
*మీ తదుపరి సినిమా గురించి చెప్పండి?
‘నేను స్టూడెంట్’ అనే ఒక థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. ఇప్పటికే చిత్రీకరణ కూడా పూర్తయింది. మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
*’గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’ సినిమాలతోపాటు మీ చిత్రం విడుదల కావడం ఎలా ఉంది?
అలాంటి పెద్ద సినిమాలతో పాటు విడుదల కావడం కొంచెం ఆందోళనగానే ఉంది. అదే సమయంలో చిరంజీవి గారు, నాగార్జున గారి పక్కన నా పోస్టర్ చూసుకోవచ్చు అనే ఆనందం కూడా ఉంది. దసరా అనేది పెద్ద పండగ. ప్రేక్షకులకు నచ్చేలా ఉంటే ఇలాంటి పండగకు ఎన్ని సినిమాలైనా ఆదరణ పొందుతాయి. మా స్వాతిముత్యం కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని భావిస్తున్నాను.
*సితార బ్యానర్ గురించి చెప్పండి?
చాలా పెద్ద బ్యానర్. మంచి విలువలున్న బ్యానర్. అందరినీ చాలా బాగా చూసుకుంటారు. అందరికీ గౌరవం ఇస్తారు.
*మీ అన్నయ్యతో కలిసి నచించే అవకాశముందా?
మంచి కథ. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు లభిస్తే ఖచ్చితంగా ఇద్దరం కలిసి నటిస్తాం.
*మీ డ్రీమ్ రోల్ ఏంటి?
అలా ప్రత్యేకంగా ఏం లేదు. అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. కానీ రాజమౌళి గారి సినిమాలో నటించాలనుంది.
*మీ అభిమాన హీరో ఎవరు?

వెంకటేష్ గారు. చిన్నప్పటి నుంచి నేను వెంకటేష్ గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని.

Related Posts

Latest News Updates