తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతీకైన బతుకమ్మ పండుగకు సర్కారు చీరలను సిద్ధం చేసింది. ప్రతి ఇంటా ఆడబిడ్డలు ఆనందంతో ఉండేలా ప్రతి ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ గురువారం నుంచి ప్రారంభించనున్నట్టు పరిశ్రమలు,చేనేత, జౌళి శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు చేయూతనివ్వడంతోపాటు ఆడబిడ్డలకు చిరుకానుక ఇవ్వాలన్న మహోన్నత లక్ష్యంతో 2017లో చీరల పంపిణీ ప్రారంభించినట్టు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని..ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ చేనేత శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. 24 రకాల డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయ రంగులు, 240 రకాల త్రెడ్‌బోర్డర్ (దారపు పోగుల అంచులు)తో 100 శాతం పాలిస్టర్ ఫిలమెంట్ నూలు చీరలను తయారు చేశారు.