ఢిల్లీలోని కర్తవ్యపథ్​లో మంగళవారం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 వరకు బతుకమ్మ పాటలు, కోలాటాలతో కర్తవ్యపథ్ మారుమోగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మీనాక్షి, అనురాగ్ ఠాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్ కుటుంబ సభ్యులు, మహిళా ఐఏఎస్, ఐపీఎస్​లు సంబురాల్లో పాల్గొన్నారు.తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవమే బతుకమ్మ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ గడ్డపై బతుకమ్మ సంబురాలతో తెలంగాణ గౌరవానికి ప్రత్యేక గుర్తింపు దక్కిందన్నారు.

 

 

ఏడాదిపాటు నిర్వహించే హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీలో బతుకమ్మ సంబురాలు చేశామని చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వచ్చిన మహిళలు మధ్యాహ్నం నుంచే బతుకమ్మను అందగా పేర్చి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. వీళ్లతో కలిసి కేంద్ర మంత్రులు మీనాక్షి లేఖి, అనురాగ్ ఠాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్ కుటుంబ సభ్యులు, మహిళా ఐఏఎస్, ఐపీఎస్ లు, పెద్ద సంఖ్యలో ఉత్తరాది మహిళలు సంబురాల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు సర్బానంద్ సోనోవాల్, జితేంద్ర సింగ్, అజయ్ భట్, అన్నపూర్ణ దేవి తదితరులు హాజరయ్యారు.