మునుగోడు ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అది కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నిక కాబోతోందని జోస్యం చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత ముగింపు సభ పెద్ద అంబర్ పేట్ లో జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ ఖేల్ ఖతం కాబోతోందని, ఆయన దుకాణం బంద్ అవ్వడం ఖాయమన్నారు. కేసీఆర్ తో తాము లడాయికి సిద్ధపడ్డామని, ఎంఐఎంతో కలిసి వచ్చినా, బల ప్రదర్శనకు మాత్రం తాము సిద్ధమన్నారు. దళిత వ్యక్తిని సీఎం చేస్తానని చెప్పి, కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.

 

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే సెక్రెటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టారని అన్నారు. ఇంత చేసినా… సీఎం కేసీఆర్ ని ప్రజలు మాత్రం నమ్మరని ఎద్దేవా చేశారు.గడీల పాలనలో తెలంగాణ తల్లి బందీగా మారిందన్నారు. గరీబోళ్ల రాజ్యం కావాలో.. గడీలరాజ్యం కావాలో. రామరాజ్యం కావాలో.. రావణ రాజ్యం కావాలో తెలంగాణ ప్రజలే తేల్చుకోవాలని కోరారు. తాము గనక అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు కలిగే అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఇబ్రహీం పట్నంను వీర పట్నంగా మారుస్తామన్నారు.

 

అక్టోబర్ 15 నుంచి ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర

ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పాదయాత్రను అడుగడుగునా కేసీఆర్ అడ్డుకుంటున్నారని, బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయిస్తున్నారని, కేసులు పెట్టిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. సంక్షేమ పథకాలను తీసేస్తారంటూ కొందరు టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను బీజేపీ ఆపదు. అవి టీఆర్ఎస్ వైనా.. కాంగ్రెస్ వైనా సరే.. పేదలకు మరింత మంచి జరిగేలా సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం” అని వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవడమే లక్ష్యంగా పనిచేద్దామని, ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయించేదని చెప్పారు.