TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. TSPSC ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారానికి మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని, ఐటీ శాఖ ఆయనే చూస్తున్నారని బండి పేర్కొన్నారు. ఐటీ శాఖ విఫలమైందని, అందుకే పేపర్ లీకైందని అన్నారు. చంచల్ గూడ జైలులో రిమాండ్ లో వున్న బీజేవైఎం కార్యకర్తలతో బండి సంజయ్ ఇతర బీజేపీ నేతలు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌లో ఉన్న రేణుక కుటుంబం కోసమే పేపర్ లీకేజీ అని, అక్రమంగా రేణుకకు గురుకుల పాఠశాలలో ఉద్యోగం ఇచ్చారన్నారు.

సిట్‌తో ఉపయోగం లేదని.. లీకేజీపై సిట్టింగ్ జడ్జిరో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ని రద్దు చేసి.. ఛైర్మన్‌ను ప్రాసిక్యూట్ చేయాలన్నారు. తప్పించుకోవటానికే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు. పోటీ పరీక్షలు నిర్వహించలేని స్థితిలో కేసీఆర్ సర్కార్ ఉందని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మంత్రిగా ఇంచార్జ్ తీసుకున్నవన్నీ ఫెయిల్ అయ్యాయని మండిపడ్దారు. ధరణి స్కాం, పోయిన ఏడాది జరిగిన ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్, ఇప్పుడు జరిగిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం కూడా కేటీఆర్ ఐటీ శాఖ కనుసన్నంల్లోనే జరిగాయని మండిపడ్డారు.

 

ఇవన్నీ జరుగుతున్నా కేటీఆర్ పై సీఎం కేసీఆర్ స్పందించక పోవడం హాస్యాస్పదం అంటూ విరుచుకుపడ్డారు. ఇక.. ప్రశ్నా పత్రాల లీకేజీపై ఆందోళనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. ప్రభుత్వ ఒత్తిడితోనే బీజేవైఎం కార్యకర్తలపై కేసులు మోపబడ్డాయని ఆరోపించారు. అలాగే వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టడంపై కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగులతో చెలగాటాలు ఆడుతున్నారన్నారు.