బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే అగ్నిపథ్ ను రద్దు చేస్తామన్న కేసీఆర్ ప్రకటనపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. జనరల్ బిపిన్ రావత్ కంటే సీఎం కేసీఆర్ పోటుగాడా? అంటూ మండిపడ్డారు. అగ్నిపథ్ స్కీం బిపిన్ రావత్ ఆలోచన అని, చాలా ఆలోచించే బిపిన్ రావత్ దీనిని ప్రతిపాదించారన్నారు. అలాంటి పథకాన్ని కేసీఆర్ రద్దు చేస్తామని అంటున్నారని మండిపడ్డారు. అగ్నిపథ్ ని రద్దు చేసి, మళ్లీ పాత విధానాన్నే తెస్తామని ప్రకటించడం ద్వారా… తిరిగి భారత్ లో నెహ్రూ విధానాన్ని తీసుకొస్తారా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. అసలు రక్షణ రంగంపై కేసీఆర్ పాలసీ ఏంటని, అసలు ఎప్పుడైనా ఆలోచించారా? అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో పోలీసుల పరిస్థితి ఏమీ బాగోలేదని, వారికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
కేసీఆర్ దగ్గరున్న లిక్కర్ స్కాం పైసల కోసమే నేతలు బీఆర్ఎస్ మీటింగ్ కు వచ్చారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మీటింగ్ పేరుతో వాళ్లు ఆ మాటలే మాట్లాడుకున్నరని విమర్శించారు. బీఆర్ఎస్ సభకు వచ్చిన ఒక్క నేత కూడా ఆ పార్టీ గురించి మాట్లాడలేదని సటైర్ వేశారు. కేంద్రంలో వచ్చేది ఆప్ సర్కారేనని కేజ్రీవాల్ సభలో ప్రకటించారని, అలాంటప్పుడు కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ కేంద్రంలో అధికారం ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభకు సీఎం నితీశ్ కుమార్, కుమార స్వామి ఎందుకు రాలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.