ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ”కేసీఆర్… అసలు నువ్వు మనిషివేనా? నీకు దమ్ముంటే, నాతో రాజకీయం చెయ్యి..! చేతగాక, నన్ను తట్టుకోలేక నా కొడుకును లాగుతావా? చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దనే సోయి లేదా?” అంటూ నిప్పులు చెరిగారు. తన కుమారుడు సాయి భగీరథ్ పై దుండిగల్ పీఎస్ లో కేసు నమోదు కావడంపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. తాను తప్పుచేసినందుకే సాయి భగీరథ్ తనను కొట్టాడని దెబ్బలు తిన్న విద్యార్థే ఒప్పేసుకున్నాడని, అయినా… తన కుమారుడిపై కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పిల్లలు కొట్టుకుంటారు.. మళ్లీ కలుస్తారు.. దీనిలో నీకేం నొచ్చింది? కేసు పెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది? అంటూ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దనే సోయి నీకు లేదా? అంటూ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తనడు సాయి భగీరథ్ వివాదం ముదురుతోంది. కుమారుడు భగీరథ తోటి విద్యార్థులను దూషిస్తూ.. కొట్టిన వీడియో ఇప్పటికే వైరల్ అయ్యింది. తాజాగా… ఓ జూనియర్ విద్యార్థిని బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ కొట్టినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పోలీసులు బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై కేసు నమోదు చేశారు. దుండిగల్ పీఎస్ లో కేసు నమోదైంది. బహదూర్ పల్లిలోని మహేంద్ర వర్సిటీలో సాయి భగీరథ్ బీటెక్ చదువుతున్నాడు.
తప్పు ఒప్పేసుకున్న విద్యార్థి..
అయితే… బండి సంజయ్ కుమారుడు భగీరథ్ చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థి మంగళవారం రాత్రి ఓ వీడియో విడుదల చేశాడు. బండి సంజయ్ కుమారుడి స్నేహితుడి చెల్లెల్ని తాను ఇబ్బంది పెట్టానని, ఆ కారణంతోనే సాయి భగీరథ్ తనపై చేయి చేసుకున్నాడని ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు తామంతా కలిసి మెలిసి వున్నామని ఆ వీడియోలో ప్రకటించాడు.