మెడికో ప్రీతి కేసు ముమ్మాటికీ లవ్ జిహాదే అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నూటికి నూరు శాతం లవ్ జిహాదేనని అన్నారు. తెలంగాణలో లవ్ జిహాద్ కేసులు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయని, హిందూ అమ్మాయిలను టార్గెట్ గా చేస్తున్నారని ఆరోపించారు . హిందూ అమ్మాయిలను మోసం చేస్తున్నారని, అలాంటి వారికి విదేశాల నుంచి డబ్బులు అందుతున్నాయన్నారు. ప్రీతిని వేధించిన సీనియర్ సైఫ్ ని కాపాడేందుకే చిన్న చిన్న కేసులు పెడుతున్నారన్నారు. లవ్ జిహాద్ కేసు కాబట్టే దీనిని నిర్వీర్యం చేయడానికే మామూలు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రీతి కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా… ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమీ మాట్లాడటం లేదని బండి సంజయ్ మండిపడ్డారు.
కొండగట్టు దేవాలయ చోరీపై కూడా బండి సంజయ్ స్పందించారు. గర్భగుడికే రక్షణ కల్పించలేని పరిస్థితి తెలంగాణలో వుందని.. ఇక రాష్ట్రాన్నేం కాపాడుతారని ఎద్దేవా చేశారు. అక్కడ సీసీ కెమెరాలు లేవా? అని ప్రశ్నించారు. పిచ్చోడి పని అని కొండగట్టు కేసును పక్కదారి పట్టించినా పట్టిస్తారని ఎద్దేవా చేశారు. మీరు దర్శించుకున్న కొండగట్టుపైనైనా స్పందించమని బండి సంజయ్ కోరారు. మంత్రి కేటీఆర్ దేవుడ్ని నమ్మని మూర్ఱుడని విమర్శించారు. హిందూ దేవుళ్లను అవమానించడంలో కేసీఆర్ కుటుంబం ఎంఐఎంతో పోటీ పడుతోందని బండి సంజయ్ మండిపడ్డారు.
వరంగల్ మెడికో పీజీ విద్యార్థి ప్రీతిని టార్గెట్ గా చేసుకొనే సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించాడని వరంగల్ సీపీ రంగనాథ్ అన్నారు. వాట్సాప్ గ్రూపులో మెసేజ్ ల ద్వారా అవమానించడం కూడా ర్యాగింగ్ కిందికే వస్తుందని స్పష్టం చేశారు. గ్రూప్ లో మెసేజ్ పెట్టి ప్రీతిని అవమానించాడని, ఆ ఆధారాలు తమ వద్ద వున్నాయని వెల్లడించారు. 4 నెలలుగా సైఫ్ విద్యార్థి ప్రీతిని వేధిస్తున్నాడని, గ్రూప్ లో మెసేజ్ పెట్టి, వేధించొద్దని ప్రీతి వేడుకుందని పేర్కొన్నారు.