తనకు ఎన్నికల్లో గెలుపులు ముఖ్యం కాదని… తనకు ప్రజలే ముఖ్యమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పదవులు కూడా ముఖ్యం కాదన్నారు. తనకు ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదని హేళన చేశారని, ఎన్నో అవమానాలకు గురిచేశారని కరీంనగర్ సభ వేదికగా బండి సంజయ్ కన్నీరు పెట్టుకున్నారు. ప్రజాయాత్ర ముగింపు సభలో బండి సంజయ్ మాట్లాడారు. ఇంత హేళన చేసినా… కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచానని అన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తానని, ధర్మం కోసం యుద్ధం కూడా చేస్తానని ప్రకటించారు. బీజేపీ అధినాయకత్వం తనను రాష్ట్ర అధ్యక్షుడ్ని చేయడానికి కారణం కార్యకర్తలేనని ప్రకటించారు. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడాలని ప్రధాని మోదీ, అమిత్ షా తనకు బాధ్యత అప్పజెప్పారని అన్నారు.

 

గడీల పాలనను బద్దలు కొట్టేందుకే పాదయాత్ర చేపట్టినట్లు బండి సంజయ్ ప్రకటించారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గానికి మేలు జరిగిందని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం భూమి, గ్రానైట్, సాండ్ స్కాంలకు పాల్పడుతోందని ఆరోపించారు.2001 లో సింహగర్జన పేరుతో టీఆర్ఎస్ సభ పెట్టినా… ఇంత మంది రాలేదని ఎద్దేవా చేశారు. సింహగర్జన పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని, ఇప్పుడు తెలంగాణను ఎలా చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తీసేశారని, తెలంగాణతో సీఎం బంధం తెంచుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు.