బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర కోసం నిర్మల్ జిల్లా భైంసాకు బయల్దేరిన బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకొని, కరీంనగర్ కు తరలించారు. అయితే… ఈ ఘటనపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట పాదయాత్రకు అనుమతిని ఇచ్చి, ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటని తీవ్రంగా మండిపడ్డారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వస్తున్నారని, ఏర్పాట్లు కూడా అన్ని పూర్తయ్యాయని, రూట్ మ్యాప్ ప్రకటించిన తర్వాత ఇదేం పని అని ప్రశ్నించారు.

భైంసా ప్రాంతానికి ఎందుకు వెళ్లకూడదో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం కరీంనగర్ కి వెళ్తున్నానని, సోమవారం మధ్యాహ్నం వరకూ సమయం వుందన్నారు. షెడ్యూల్ ప్రకారమే ప్రజా సంగ్రామ యాత్ర చేసి తీరుతానని స్పష్టం చేశారు. భైంసాను కాపాడలేని సీఎం కేసీఆర్ ఇక రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారు? అని ఎద్దేవా చేశారు. షెడ్యూల్ ప్రకారం కచ్చితంగా పాదయాత్ర వుంటుందన్నారు. మరోవైపు సంజయ్ అరెస్టుతో జగిత్యాల, కోరుట్ల, మెట్​పల్లి పట్టణాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు.