నందమూరి బాలయ్య కథానాయకుడిగా నటించిన చిత్రం వీరసింహా రెడ్డి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇవాళ ‘ఒంగోలు’లో నిర్వహించారు. ఈ వేడుకలో చిత్ర బృందం ట్రైలర్ వదిలారు. ఈ వేడుకను చిత్రం మూవీ మేకర్స్ చాలా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరై… సందడి చేశారు. ఒంగోలుకి చాపర్‌లో చేరుకున్న బాలయ్యకి అభిమానులతో పాటు కొంత మంది స్థానిక రాజకీయ నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బాలయ్య సమీపంలోని హోటల్‌కి వెళ్లిపోయారు. ఆ తర్వాత వేడుకకు హాజరయ్యారు. ప్రీరిలీజ్ ఈవెంట్ వద్ద కూడా ఈ రెండు సినిమాలకి సంబంధించిన భారీ కటౌట్లని అభిమానులు ఏర్పాటు చేశారు. అలానే దర్శకుడు గోపీచంద్ మలినేనికి కూడా ఓ కటౌట్‌ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… తన తండ్రి ఎన్టీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. నటనలో ఆయన ప్రయోగాల దిట్ట అని, అలాంటి నటుడు మరొకరు లేరన్న విషయాన్ని ప్రతీ నటుడూ అంగీకరించక తప్పదన్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా చేయడం తనకెంతో ఆనందంగా వుందన్నారు. దర్శకుడు బి. గోపాల్ తో తనకున్న అనుబంధాన్ని నందమూరి బాలకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అభిమానం అంటే డబ్బుతో కొనేది కాదని, కొన్ని ప్రలోభాలకు లోను కానిది అభిమానమన్నారు.
ఇక… మధ్య మధ్యలో సినిమా డైలాగులను వినిపించి బాలయ్య అభిమానులను అబ్బురపరిచారు. ఈ సందర్భంగా తన అన్ స్టాపబుల్ షో గురించి చెప్పుకొచ్చారు. బాలకృష్ణను ఇంకా దగ్గరగా చూడాలన్న అభిమానుల కోరిక ఉన్నదో.. రాడులే.. తను రాజకీయాలకు, సినిమాలకే పరిమితంలే.. అనుకున్న వారికి ఆహా ద్వారా అన్ స్టాపబుల్ షో చేసి.. ఈ రోజు మొత్తం ప్రపంచంలోనే టాక్ షోలకు అమ్మ మొగుడై కూర్చుంది అది అంటూ చెప్పుకొచ్చారు. ఇక సినిమాలో నటించిన వారి గురించి పేరు పేరునా చెప్పుకొచ్చిన బాలయ్య… ప్రతి ఒక్కరి కష్టం సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, వీరసింహారెడ్డి గుర్తుండిపోయే చిత్రాలన్నారు. సప్తగిరి నుంచి తాను కామెడీ టైమింగ్ నేర్చుకోవాలని, తమన్ సంగీతం అందించిన పాటలు ఎలా వున్నాయో చూశారన్నారు. సాయి మాధవ్ బుర్రా రాసిన మాటలు పేలుతాయని, అద్భుతమైన సినిమా అని, బాగా ఆడి తీరుందున్నారు.