ఆస్ట్రేలియాకు చెందిన హెన్రిచ్ డి విల్లియర్స్ ఒక్క రోజులో ఎక్కువ పబ్‌లను చుట్టేసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించాలి అనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఈ ఏడాది గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఇతను 24 గంటల్లో మెల్‌బోర్న్‌లోని 78 పబ్‌లకు వెళ్లొచ్చాడు. హెన్రిచ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మెల్‌బోర్న్, విక్టోరియా నగరాల్లోని పబ్‌లు, బార్లకు వెళ్లాడు. వెళ్లిన చోటల్లా కొంచెం మద్యం రుచి చూశాడు. ‘మెల్‌బోర్న్‌లోని బార్లు, పబ్‌ల జాబితా తయారుచేసుకుని, రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నా. పబ్‌లోకి వెళ్లగానే గిన్నిస్ రికార్డ్ గురించి చెప్పేవాన్ని. నియమాల ప్రకారం ప్రతి బార్, పబ్‌లో 125 మిల్లీలీటర్ల మద్యం మాత్రమే తాగాను’ అని హెన్రిచ్ చెప్పాడు.
ఇంతకు ముందు ఈ రికార్డ్ ఇంగ్లాండ్‌కి చెందిన నాథన్ క్రింప్ పేరు మీద ఉంది. నాథన్ ఒక్కరోజులో బ్రిఘ్‌టన్ సిటీలోని 67 పబ్‌లని చుట్టేసి వచ్చాడు. ఇతను పబ్‌ల వెంట తిరగడం వెనక ఓ కారణం ఉంది. కరోనా కాలంలో మెల్‌బోర్న్ సిటీలోని పబ్‌లు, బార్లు గిరాకీ లేకపోవడంతో వెలవెలబోయాయి. దాంతో స్థానిక పబ్‌లకు జనాన్నిరప్పించేందుకు, ఎక్కువ మందికి తెలియని పబ్‌లు, బార్ల గురించి తెలియజేసేందుకు హెన్రిచ్ ఈ ఛాలెంజ్ స్వీకరించాడు.