రాజస్థాన్ అసెంబ్లీలో అరుదైన ఘనట చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తూ అసెంబ్లీలోనే తప్పులో కాలేసేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగాన్ని చేస్తున్న సందర్భంలో ఏకంగా 7 నిమిషాల పాటు గత యేడాది బడ్జెట్ ప్రతులను చదివేశారు. గతేడాది పద్దులోని విషయాలనే ఈసారి కూడా చదివేశారు. దీంతో సీఎం పక్కనే వున్న మంత్రి మహేశ్ జోషి ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే సీఎంకి తెలియజేశారు. ప్రతిపక్ష సభ్యులు ఎగతాళి చేయడంతో గెహ్లాట్‌కు ఏం జరిగిందనేది స్ఫురణకు వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. బడ్జెట్ ప్రతులను చదువుతూ… పాత పథకాలు, గత యేడాది అమలు చేసిన పట్టణ అభివ్రుద్ధి ప్రణాళికలను ప్రస్తావించారు.
దీంతో బీజేపీ సభ్యులు తీవ్రంగా స్పందించారు. వెల్ లోకి వెళ్లి, నిరసన వ్యక్తం చేశారు. కొత్త పద్దులోని విషయాలు లీక్ అయ్యాయి… అంటూ ఆరోపించారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా ఘాటుగా స్పందించారు. ఇలా పాత బడ్జెట్ ను చదివేవారి చేతిలో రాష్ట్రం ఎంత సురక్షితంగా వుంటుందో మీరే ఊహించుకోగలరు. 8 నిమిషాల పాటు సీఎం పాత బడ్జెట్ చదివారు. ఇలా జరగడం చరిత్రలో ఇదే మొదటి సారి కావొచ్చు. నేను సీఎంగా వున్న సమయంలో ఒకటికి రెండు సార్లు బడ్జెట్ ప్రతులను పరిశీలించుకునేదాన్ని. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అవుతుంది అని వ్యాఖ్యానించారు.
దీనిపై ముఖ్యమంత్రి గెహ్లాత్ స్పందించారు. తాను చదువుతున్న ప్రతులకు, సభ్యుల చేతిలో వున్న ప్రతుల్లోని అంశాలకు తేడా వుంటే తప్పును ఎత్తి చూపాలన్నారు. పాత పత్రాలను చూసుకునేందుకే తన వెంట తెచ్చుకొన్నానని వివరణ ఇచ్చారు. బడ్జెట్ ఎలాంటి లీక్ కాలేదని స్పష్టం చేశారు. బడ్జెట్ ను కూడా బీజేపీ చెత్త రాజకీయాలకు వాడుకుంటోందని రివర్స్ కౌంటర్ ఇచ్చారు.