ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఆదివారం విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. కొత్త పాలసీ విధానంపై కేజ్రీవాల్ ని సీబీఐ ప్రశ్నించే అవకాశం వుంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ పలువుర్ని విచారించింది, అరెస్ట్ కూడా చేసింది. ఇదే కేసులో ఆప్ నేత సిసోడియా జైలులోనే వున్నారు.
ఇక…. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా సీబీఐ ఇప్పటికే విచారించింది. ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఇదే కేసులో సీబీఐ కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ లో సిసోడియాను ఏ-1గా చేర్చింది. ఇప్పటి వరకూ సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, మాగుంట రాఘవరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అవకతవకలు జరిగాయంటూ ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా 2022 లో కేంద్ర హోంశాఖకి లేఖ రాశారు. దీంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.