జమ్మూ-కశ్మీరులో సాధారణ ప్రజానీకం హింసను తిరస్కరిస్తోందని సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే చెప్పారు. అయితే కొన్ని ప్రాక్సీ టెర్రరిజం గ్రూపులు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని తెలిపారు. ఈ ప్రాక్సీ టెర్రరిస్టులు దాడులు చేయడానికి ప్రయత్నించినపుడు, వారిని మట్టుబెడుతున్నట్లు తెలిపారు. ఈశాన్య భారత రాష్ట్రాల్లో విప్లవవాద గ్రూపులు ప్రధాన జీవన స్రవంతిలో చేరడానికి ప్రభుత్వ చర్యలు ఎంతో సహాయపడుతున్నాయని తెలిపారు. బెంగళూరులో జరిగిన ఆర్మీ డే పెరేడ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్, జమ్మూ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వీటిని నిరోధించేందుకు కౌంటర్ డ్రోన్ జామర్స్‌ను ఉపయోగిస్తున్నామని చెప్పారు. భారత దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉందని చెబుతూ.. వాస్తవాధీన రేఖ వెంబడి ఎటువంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పటికీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఏ క్షణంలోనైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పేర్కొన్నారు.