సికింద్రాబాద్- విశాఖ మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రారంభించే ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 15 న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ఈ రైలును ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని పీఎంవో ప్రకటించింది. అయితే.. కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యక్షంగానే పాల్గొంటారు. ఈ నెల 16 నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వే ఈ వందే భారత్ ట్రైన్ కి 20833 అనే నెంబర్ ను ఇచ్చింది. ఇది ఉదయం 5:45 గంటలకు విశాఖ పట్నం నుంచి బయల్దేరి… మధ్యాహ్నం 2:15 నిమిషాలకు సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి రాత్రి 11:30 కి విశాఖకు చేరుకుంటుంది. కాగా, తొలి రోజు ప్రయాణంలో భాగంగా ఈ రైలు 21 స్టేషన్లలో ఆగనుంది. చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ జంక్షన్, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతూ విశాఖపట్నం చేరుకోనుంది. ఆ తర్వాతి రోజు నుంచి ఎంపిక చేసిన నాలుగు స్టేషన్ల(వరంగల్, విజయవాడ, ఖమ్మం, రాజమండ్రి)లో మాత్రమే హాల్ట్ ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.







