ఏపీకి విశాఖే రాజధాని.. మూడు రాజధానులని మిస్ కమ్యూనికేట్ అయ్యింది : బుగ్గన సంచలన వ్యాఖ్య

ఇన్ని రోజుల పాటు మూడు రాజధానులంటూ తెగ ప్రచారం చేసిన ఏపీ ప్రభుత్వం ఒక్క సారిగా మాట మార్చేసింది. మూడు రాజధానులు అంటూ ప్రజల్లోకి మిస్ కమ్యూనికేట్ అయ్యిందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సంచలన ప్రకటన చేవారు. 3 రాజధానులంటూ ఏమీ లేవని, రాష్ట్రానికి విశాఖపట్నమే ఏకైక రాజధాని అని తేల్చి చెప్పారు. బెంగళూరులో జరిగిన రోడ్ షోలో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుగ్గన ఏపీ రాజధాని అంశంపై ప్రకటన చేశారు. మూడు రాజధానులు అంటూ ప్రజల్లోకి మిస్ కమ్యూనికేట్ అయిందన్నారు. ఏపీ పరిపాలన విశాఖ నుంచే జరుగుతుందని స్పష్టం చేశారు.

 

ఏపీకి విశాఖ ఒక్కటే రాజధాని అని అన్నారు. ఏపీకి 3 రాజధానులు అనే కాన్సెప్ట్ వాస్తవం కాదన్నారు. కర్నూలు న్యాయ రాజధాని కాదని, అక్కడ హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే వుంటుందని స్పష్టం చేశారు. కర్ణాటకలోని ధార్వాడ్, గుల్బర్బాలో హైకోర్టు బెంచ్ లు ఉన్నాయని అలాగే ఏపీలోనూ ఉంటాయన్నారు. 1937 శ్రీబాగ్ ఒప్పందంలో.. రాజధాని ఒక చోట, హైకోర్టు మరొక చోట ఉండాలని పేర్కొన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు బెళగాంలో ఒక సెషన్ నిర్వహిస్తారని.. అదే విధంగా అసెంబ్లీ సమావేశాలు ఓ సెషన్ గుంటూరులో జరుగుతాయన్నారు.

పారిశ్రామిక వృద్ధి ప్రాంతాలుగా తిరుపతి, విజయవాడను ఎందుకు ఎంచుకోలేదని పలువురు పారిశ్రామికవేత్తలు మంత్రుల్ని ప్రశ్నించగా… పై విధంగా సమాధానం ఇచ్చారు. ఏపీ తదుపరి రాజధానిగా విశాఖను తమ ప్రభుత్వం నిర్ణయించిందని, ఏపీకి మూడు రాజధానులు వున్నాయన్న సమాచారం పూర్తిగా అవాస్తవమని వివరించారు. రాష్ట్ర పాలన అంత విశాఖ నుంచే నిర్వహించాలని అనుకున్నామని, విశాఖను ఎంచుకోవడానికి అక్కడి మౌలిక సదుపాయాలే కారణమని వివరించారు.

అక్కడ ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కూడా వుందని, ఐటీ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు ఇప్పటికే వున్నాయన్నారు. భవిష్యత్తులో విశాఖ మరింత డెవలప్ అయ్యే అవకాశం వుందని, ఓడరేవు నగరంగా ఇప్పటికే గుర్తింపు పొందిందన్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద లాగే విశాఖను ఐటీ రంగానికి చిరునామాగా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నామని బుగ్గన వివరించారు.

 

Related Posts

Latest News Updates