ఏపీకి చెందిన నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి చింత పార్థసారథి బీఆర్ఎస్ లో చేరారు. వీరందరికీ సీఎం కేసీఆర్ కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు టీజే ప్రకాశ్‌ (అనంతపురం సీనియర్‌ నేత), తాడిపాక రమేశ్‌నాయుడు (కాపునాడు జాతీయ అధ్యక్షుడు), గిద్దల శ్రీనివాస్‌నాయుడు (కాపునాడు ప్రధాన కార్యదర్శి), జేటీ రామారావు (ఆంధ్రప్రదేశ్‌ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు), రాధాకృష్ణ, బంగార్రాజు (ముమ్మిడివరం), శ్రీనివాసయాలు (కొత్తపేట), జీ శ్రీనివాసునాయుడు (అవిడి), వెంకటేశ్వర్‌రావు (గురిజాల), వంశీకృష్ణ, సతీశ్‌కుమార్‌ (నూజివీడు), ఉంజనేని అశోక్‌, యూ ఫణికుమార్‌ (గుడివాడ), తోటకూర కోటేశ్‌, నయీం ఉల్‌ ముల్క్‌ (నందిగామ), భారతి (మంగళగిరి) తదితరులు కూడా బీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ లో ఏపీ నుంచి ఎమ్మెల్యేలు, కీలక వ్యక్తులు కూడా చేరనున్నారని ప్రకటించారు. సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ పనులు వేగం పుంజుకుంటాయని, విస్తరణ ప్రారంభమవుతుందని ఈ సందర్బంగా ప్రకటించారు. దేశంలోని 6 లక్షల పైచిలుకు గ్రామాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామని, అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమాంతరంగా నడుస్తామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. రెండు సంవత్సరాల్లోనే వెలుగుల జిలుగుల భారత్ చేస్తామని హామీ ఇచ్చారు. దేశమంతటా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని, ఏటా 25 లక్షల మందికి దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానిది ప్రైవేట్ విధానమని, తమది జాతీయీకరణ అని ప్రకటించారు.

ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలేనని, నేతలు మాత్రం కాదని కేసీఆర్ పునరుద్ఘాటించారు. కానీ ప్రతిసారి పార్టీలు గెలుస్తున్నాయని, నాయకులు గెలుస్తున్నారని అన్నారు. ఏ ఆశతో అయితే ప్రజలు గెలిపిస్తున్నారో ఆ లక్ష్యం నెరవేరడంలేదని, మన దేశంలో నిరంతరం ఇదే జరుగుతోందన్నారు. ఇది పోవాలని, ఇదే బీఆర్‌ఎస్‌ లక్ష్యమని కేసీఆర్ ప్రకటించారు. మన ప్రయత్నం ప్రబలంగా ఉంటే, మనం సందేశం చెప్పితే, దాన్ని ప్రతి మనిషికి, ప్రతి గుండెకు చెప్పగలిగితే దేశం కచ్చితంగా స్పందిస్తుందని అన్నారు. భారతదేశం బుద్ధిమంతుల దేశం. బుద్దూగాళ్ల దేశం కాదని సీఎం కేసీఆర్ అన్నారు.