మూడు రాజధానుల అంశంపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీం తలుపు తట్టింది. రాజధానిగా అమరావతి వుండాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. అమరావతే రాజధానిగా వుండాలని హైకోర్టు పేర్కొనడం శాసన వ్యవస్థ అధికారాలను ఉల్లంఘించినట్లే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్ లో స్పష్టంగా పేర్కొంది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే చేయాలంటే తమ అధికారాలను ప్రశ్నించడమే అని, పరిపాలన వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని తాము భావిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. తక్షణమే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపేయాలని, ఈ అంశంలో వెంటనే స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
