ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించడం లేదు.. గవర్నర్ కి ఫిర్యాదు చేసిన ఏపీ ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా నిస్సహాయ స్థితిలోనే వున్నారని అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. గత్యంతరం లేకే తాము గవర్నర్ ని కలిసి, వినతి పత్రం ఇచ్చామని వివరణ ఇచ్చారు. సకాలంలో వేతనాలు అందక, ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులకు వేతనాలను ప్రతి నెలా మొదటి తేదీనే ఇవ్వాలని వున్నా… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల అనుమతి లేకుండానే జీపీఎస్ ను విత్ డ్రా చేసేశారని, 90 వేల మంది ఉద్యోగుల ఖాతా నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. తమ సమస్యలను గవర్నర్ కి విన్నవించామని, సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు.

Related Posts

Latest News Updates