విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు తాము అండగా వుంటామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అమరవీరులైన త్యాగధనుల పోలీసు కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పక్షాన, ప్రజల పక్షాన సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలన్నది తన మనసులో వున్న కోరిక అని, అయితే… సిబ్బంది కొరతతో దాన్ని పూర్తిగా అమలు చేయలేకపోతున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు పనిభారం తగ్గించేందుకు ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. 6,511 ఖాళీల భర్తీకి తాము అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు బాగా మెరుగుపడిందని సీఎం జగన్ మెచ్చుకున్నారు.