టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఆయన వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. 160 సీఆర్పీసీ కింద ఇప్పటికే నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.కాగా.. నారాయణ అనారోగ్యంతో బాధపడుతూ… ఇటీవల శస్త్రచికిత్స పూర్తవడంతో సీఐడీ విచారణకు హాజరుకాలేమని నారాయణ తరుపు న్యాయవాదులు హైకోర్టుకు తెలియజేశారు. దీంతో నారాయణను హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో విచారించుకోవచ్చని సీఐడీకి హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ క్రమంలోనే సీఐడీ హైదరాబాద్ లోని నారాయణ ఇంటికి వెళ్లి… వాంగ్మూలం రికార్డు చేసింది. 2014-19 మధ్య ఇన్నర్ రింగు రోడ్డు భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అలైన్ మెంట్ మార్చడంతో కొన్ని సంస్థలకు లబ్ధి చేకూర్చారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ విచారణ ప్రారంభించింది.












