మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుమారుడు, టీడీపీ యువనేత చింతకాయల విజయ్ కు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6 న మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఉన్న సైబర్ క్రైం పీఎస్ లో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లో ఉన్న చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో విజయ్ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు. 41 సీఆర్ పీసీ ప్రకారం నోటీసులు అంటించారు. ప్రస్తుతం వాడుతున్న సెల్ ఫోన్స్, నెంబర్స్ తో పాటు ఐడీ, అడ్రస్ ప్రూఫ్ తో హాజరు కావాలని చింతకాయల విజయ్ ను ఆదేశించారు. ఒకవేళ మంగళగిరి సీఐడీ ఆఫీస్ లో హాజరు కాని పక్షంలో 41A(3),(4) సీఆర్ పీసీ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో తెలియజేశారు.
సీఐడీ నోటీసులపై చింతకాయల విజయ్ తండ్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. ఏపీ సీఐడీ నిబంధనలను అతిక్రమిస్తోందని మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా సీఐడీ అధికారులు ఎలా వస్తారని ప్రశ్నించారు. చట్టం ప్రకారం వస్తే ఏవరైనా సహకరిస్తారని, కానీ ఇదేం పద్ధతి అని మండిపడ్డారు. జగన్ దోపిడీని ప్రశ్నించడంతోనే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.